చర్మ సౌందర్యాన్ని ఇనుమడింప చేసుకోవడానికి ఇంట్లోనే మసాజ్ లు, ప్యాక్ లు, ఇంకా సింపుల్ గా చేసుకునే స్టీమింగ్ ప్రోసీజర్ మీ కోసం…
1. కీర రసం సహజసిద్దమైన ఆస్ట్రిజెంట్. ఇది చర్మానికి మృదుత్వాన్నివ్వడంతో పాటు అదనంగా ఉన్న జిడ్డును తొలగించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ఈ రసాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడగాలి.
2. కమలాపండు తొక్కలను ఎండబెట్టి పొడి చేసి దానిలో పెరుగు కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడగాలి.
3. పచ్చపసుపులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడగాలి. ఇది సహజసిద్దమైన బ్లీచ్. ఇది చర్మాన్ని తెల్లబరుస్తుంది. ఎండకు కమిలిన చర్మాన్ని తిరిగి యదాస్థితికి తెలుస్తుంది.
4. పచ్చిబంగాళాదుంపలను చక్రాలుగా కోసి ముఖం మీద రుద్దితే మచ్చలు, గీతలు పోతాయి.
5. తేనె చర్మానికి మృదుత్వాన్ని, మెరుపును ఇస్తుంది. ముడతలను తగ్గిస్తుంది. కాబట్టి ఏ ప్యాక్ లోనయినా మూడు నాలుగు చుక్కలు తేనె కలుపుకోవచ్చు. .తేనె, పసుపు, శెనగపిండి కలిపి ఫేస్‌ప్యాక్‌లా వేసుకుని 15- 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుగుకుంటే చర్మకాంతి పెరగడమే కాకుండా వయసుతో వచ్చే ముడతలు కూడా తగ్గుతాయి. నిమ్మరసంలో తేనె కలిపి ముఖం, మెడ, చేతులకు పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే కాలుష్యం వల్ల పేరుకున్న మురికి తొలగి పోవడమే కాకుండా చర్మం మంచి నిగారింపు సంతరించుకుంటుంది.
6. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో ఓ టీస్పూన్ తేనె కలిపి సేవించాలి. తేనె శరీరానికి శక్తి కూడా ఇస్తుంది. నెయ్యిలో వేయించిన ఇంగువలో ఓ టేబుల్ స్పూన్ తేనె కలిపి రోజుకు మూడు సార్లు సేవిస్తే జీర్ణశక్తి మెరుగవడమే కాకుండా శరీరాన్ని రోజంతా ఉల్లాసవంతంగా ఉంచుతుంది.
7. ఒక కప్పు పెసరపిండిలో అరటీస్పూన్ పచ్చిపసుపు, తొమ్మిది పది స్పూన్ల బాదం నూనె కొద్దిగా నీళ్ళు వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ పేస్టుని పలుచని పొరలా శరీరానికి పట్టించాలి. పూర్తిగా ఆరిన తర్వాత మెల్లగా రుద్దుతూ వదిలించి ఆ తర్వాత స్నానం చేయాలి.
8. పెదువుల తడి ఆరిపోయినప్పుడు నాలుకతో పెదవులను తడిపితే తాత్కాలికంగా మెత్తబడినప్పటికీ కొద్ది సేపటికే మరింతగా పొడిబారతాయి. కాబట్టి లిప్ బామ్ కాని బోరోలిన్ కాని రాస్తే మంచిది.
9. కలబంద రసంలో ముల్తాని మట్టి లేదా చందనం పౌడర్ కలిపి ముఖంపై లేదా చర్మంపై పూస్తే చర్మంలోనున్న మృతకణాలు మటుమాయం చేస్తుంది.
10. కలబంద గుజ్జు ముఖ వర్చస్సును పెంపొందించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జులో మోతాదుకు సరిపడా పుసుపు జోడించి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే, ముఖం పై పేరుకున్నమురికి తొలగిపోయి కొత్త రూపును సంతరించుకుంటుంది.